Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రీరామనవమిని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసి ఉండనున్నాయి. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ సెలవును కేటాయించారు.

శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులకు కూడా రేపు అధికారిక సెలవు ఉంది. అయితే, ఈ సెలవు కేవలం ఒక్క రోజుతో ముగిసిపోవడం లేదు. మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమి కావడమే కాకుండా, ఆ తర్వాతి రోజు మార్చి 28న నాలుగో శనివారం (4th Saturday) కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక మార్చి 29న ఆదివారం ఎలాగూ సాధారణ సెలవు దినమే. దీనివల్ల వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.

వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో, ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చెక్కుల క్లియరెన్స్, నగదు డ్రా చేయడం వంటి అత్యవసర పనులు ఉంటే ఈరోజే (గురువారం) పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో మళ్లీ సోమవారం (మార్చి 30) వరకు వేచి చూడాల్సి ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు మరియు ఏటీఎం సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, బ్యాంకు పనుల కోసం వెళ్లే వారు ఈ విషయాన్ని గమనించాలి.

వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉండవచ్చని వినియోగదారులు భావిస్తున్నారు. కాబట్టి సామాన్యులు తమ అవసరాలకు సరిపడా నగదును ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. అలాగే, శ్రీరామనవమి వేడుకల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు కూడా ఈ మూడు రోజుల వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *