Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు దాటుతుండటంతో, రానున్న మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పుల (Heat Waves) బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి సూచించారు. బుధవారం ఆర్టీజిఎస్ (RTGS) వేదికగా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు తమ పని వేళలను మార్చుకోవాలని జయలక్ష్మి ఆదేశించారు. ఉదయం 11 గంటల లోపే పనులు ముగించుకోవాలని, పని ప్రదేశాల్లో కచ్చితంగా నీడ కోసం టెంట్లు, తాగునీరు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. అలాగే, ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా మున్సిపల్, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కేవలం మనుషులకే కాకుండా, మూగజీవాల కోసం గ్రామాల్లోని నీటి తొట్టెలను ట్యాంకర్ల ద్వారా నిరంతరం నింపాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-26’ ప్రకారం ప్రతి జిల్లా, డివిజన్ స్థాయిలో నోడల్ అధికారులను నియమించి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదైతే దానిని తీవ్రమైన వడగాల్పులుగా పరిగణిస్తారని, అప్పుడు శరీరం తన ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని జయలక్ష్మి పేర్కొన్నారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. ఇప్పటికే వాట్సప్, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తున్నామని తెలిపారు. ఎండ తీవ్రత మరియు వడగాల్పులకు సంబంధించిన సమాచారం లేదా అత్యవసర సహాయం కోసం ప్రజలు ఈ క్రింది టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు. (స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 112, 1070, 1800-425-0101)
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మే నెల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఏ ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ప్రజలకు ముందుగానే ఎస్సెమ్మెస్ (SMS) ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు వెల్లడించారు.