Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం మోపమని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. కాగా, తాజాగా ఏపీ ఈఆర్సీ ట్రూ అప్ ఛార్జీల పైన ఈఆర్సీ ప్రతిపాదనల వేళ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపకూడదని నిర్ణయించింది. డిస్కమ్‌లు చూపించిన సుమారు రూ.16 వేల కోట్ల మేర లోటును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. దీంతో, వినియోగదారులకు బిగ్ రిలీఫ్ దక్కనుంది.
విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.4497.89 కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించింది. మొత్తం మీద 21 నెలల్లో రూ.20,288.46 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించింది. గత ఏడాది సెప్టెంబరు లో రూ.923 కోట్లను ‘ట్రూడౌన్’ చేయటంతో ద్వారా యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గించి గృహ వినియోగదారులకు మరింత ఊరట కల్పించింది. విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కంలు) 2026-27 సంవత్సరానికి రూ.17,508.17 కోట్ల ఆదాయలోటును ప్రతిపాదించాయి. దీన్ని పరిశీలించిన విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్, విద్యుత్ కొనుగోలు చార్జీల సర్దుబాటు, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జ్‌స్టమెంట్(ఎఫ్‌పీపీసీఏ) చార్జీల కింద రూ.1717.60 కోట్లకు కోత వేసింది. ఈక్రమంలో రూ.15,790.57 కోట్ల ఆదాయ లోటుకు మాత్రమే ఆమోదం తెలిపింది. అయితే, ఈ లోటును వినియోగదారులపై మోపవద్దని, ఆ మొత్తాన్ని తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీకి లిఖితపూర్వకంగా తెలిపింది.

ఈ నిర్ణయం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏ వినియోగదారులపైనా విద్యుత్ చార్జీల పెంపు భారం ఉండదు. ఈ నిర్ణయంతో 2024-25 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్ చార్జీల విధింపు నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించింది. వివిధ రకాల వ్యాపారు లకు లబ్ధి చేకూరేలా ఈఆర్సీ పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్‌లను ప్రస్తుతం ఉన్న వాణిజ్య విభాగం నుంచి పారిశ్రామిక విభాగానికి మార్చారు. జాతీయ రహదారులపై వీధి దీపాలను విభాగం-2(వాణిజ్య) నుంచి విభాగం-4(ఏ) యుటిలిటీస్ విభాగానికి మార్చారు. విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంపై పంపిణీ సంస్థలు దృష్టి సారించాలని ఈఆర్సీ ఆదేశించింది. పంపిణీ సంస్థలు, ట్రాన్స్‌కో తమ తమ వెబ్‌సైట్లలో ప్రమాదాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఫొటోలను, వివరాలను సామాన్య ప్రజలు సైతం అప్‌లోడ్ చేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది.