మీ కళ్లు జాగ్రత్త! ⚠️ ఈ నీటితో కంటి చూపు పోయే ప్రమాదం!Acanthamoeba

జాగ్రత్త! మీరు ఈత కొడుతున్నారా? కళ్లద్దాలకు బదులు లెన్సులు వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. కంటి చూపును శాశ్వతంగా బలితీసుకునే ఒక భయంకరమైన సూక్ష్మజీవి మన చుట్టూనే పొంచి ఉందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం కలుషిత నీటి ద్వారానే కాదు, మనం వాడే ట్యాప్ వాటర్ ద్వారా కూడా ఈ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందంటున్నారు. అసలేంటి ఈ అకాంథమీబా? దీని నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.Acanthamoeba

కంటి చూపు అనేది ప్రకృతి మనకిచ్చిన వరం. కానీ, ఒక చిన్న అజాగ్రత్త ఆ వరాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. శుభ్రత లేని చెరువులు, బావులు, స్విమ్మింగ్‌ పూల్స్‌లో ఈత కొట్టడం మనం సరదాగా భావిస్తాం. అలాగే, కాంటాక్ట్ లెన్సులను శుభ్రం చేయడానికి ట్యాప్ వాటర్ వాడటం చాలా మందికి అలవాటు. కానీ, ఈ అలవాటే మీ కంటికి శాపంగా మారుతుందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ (LVPEI) చేసిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.

ఈ అధ్యయనంలో ‘అకాంథమీబా’ (Acanthamoeba) అనే ప్రమాదకరమైన ప్రోటోజోవా గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కలుషిత నీటిలో లేదా పర్యావరణం ద్వారా కంటిలోకి చేరి ‘అకాంథమీబా కెరటైటిస్‌’ అనే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఇది నేరుగా కంటిలోని నల్లగుడ్డు అంటే కార్నియాపై దాడి చేసి, దానిని పూర్తిగా దెబ్బతీస్తుంది. కేవలం కంటికే పరిమితం కాకుండా, ఇది మెదడు, చర్మం మరియు సైనస్‌ల మీద కూడా దాడి చేసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎల్వీపీఈఐ వైద్యులు సోహిని మండల్, సౌమ్య సుచిత బృందం గత 12 ఏళ్లలో ఈ వ్యాధితో బాధపడుతున్న 23 మంది రోగుల కార్నియా నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశోధనలో తేలిందేమిటంటే, ఈ సూక్ష్మజీవికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి ‘ట్రోపోజాయిట్’ దశ. ఈ దశలో ఇది కంటి కణజాలాన్ని ఆహారంగా తీసుకుంటూ వేగంగా వ్యాపిస్తుంది.Acanthamoeba

మనం మందులు వాడినప్పుడు లేదా దానికి ఆహారం అందనప్పుడు, అది మరింత ప్రమాదకరమైన ‘సిస్ట్’ (Cyst) రూపంలోకి మారిపోతుంది. అంటే తన చుట్టూ ఒక గట్టి పొరను ఏర్పరచుకుని, మందులకు లొంగకుండా నిద్రాణ స్థితిలోకి వెళ్తుంది. చికిత్స పూర్తయిందని మనం అనుకునే లోపే, అది మళ్ళీ తిరగబెట్టి కంటి చూపును హరిస్తుంది.

ఈ అధ్యయనంలో మరో కీలక విషయం బయటపడింది. కన్ను ఎంత తీవ్రంగా దెబ్బతింటుంది అనేది అక్కడ ఉన్న సూక్ష్మజీవుల సంఖ్యపై కాకుండా, మన శరీర రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగే వాపు (Inflammation) కార్నియాను మరింత వేగంగా నాశనం చేస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా కేవలం సూక్ష్మజీవులను చంపడమే కాకుండా, కంటి వాపును కూడా నియంత్రించడం అత్యవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.Acanthamoeba

ఈ వ్యాధి ఎంత తీవ్రమైనదంటే, కార్నియా మార్పిడి చేసినా సరే.. ఏడాదిలో 65 శాతం మందిలో చికిత్స విఫలమవుతోంది. అందుకే నివారణే మార్గం. ఈత కొట్టేటప్పుడు ప్రొటెక్టివ్ గాగుల్స్ ధరించడం, కాంటాక్ట్ లెన్సులను శుభ్రం చేయడానికి కేవలం స్టెరిలైజ్డ్ సొల్యూషన్స్ మాత్రమే వాడటం, కంటిలో ఏదైనా నలక పడినా లేదా ఎరుపు ఎక్కినా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా మనం ఈ ముప్పు నుంచి తప్పుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘ఇన్వెస్టిగేటివ్‌ ఆప్తాల్మాలజీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌’లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *